అబల కాదు సబల.. శ్రీకాంత్ కానం

అబల కాదు సబల.. శ్రీకాంత్ కానం

ప్రకృతిలో స్త్రీ పురుషులలో ఏ ఒక్కరూ విడిగా ఏమి చేయలేరు. అందుకే పార్వతి పరమేశ్వరుల జంటను విడదీయరానిదిగా పేర్కొంటూ ఎన్నో ఉదాహారణలతో నిరూపించారు మన పెద్దలు. కాని నేటి సమాజంలో స్త్రీకి నిజంగాన్నే అంత గౌరవాన్ని ఇవ్వగలుగుతున్నమా అంటే మౌనమే సమాధానం అవుతుంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా స్త్రీ వివక్షకు గురవుతూ నే ఉంది.

చదువుల తల్లి కూడా ఒక స్త్రీ మూర్తే.. అయినా చదువులోనూ వివక్షే..

చదువు స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే! విద్య వివేకాన్ని పెంపొందిస్తుంది. మనిషిని తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేస్తుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. సంస్కారాన్ని నేర్పుతుంది. ఆర్థిక స్వాతంత్ర్యానికి పునాది వేస్తుంది. అటువంటి విద్యను నేర్పడంలో కూడా స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నారు. అబ్బాయిలు చదివితే చాలు అమ్మాయిలు చదవకపోయినా పరవాలేదు అనే ధోరణి నేటికీ కనిపిస్తుంది. ఈ నాటికి చదువు చెప్పించడానికి మగ పిల్లల మీద చూపించేటటువంటి శ్రద్దాసక్తులు ఆడ పిల్లల మీద ఉండటం లేదు అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా మేమూ మారుతున్నాం అని గొప్పలు చెప్పుకోవడం కాదు దాన్ని చేతల్లో చూపిస్తూ ఆడ పిల్లల చదువుల విషయంలో తల్లి తండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే మానవజాతి మనుగడకు మార్గదర్శకురాలే స్త్రీ మూర్తి. కాని అటువంటి గొప్ప స్త్రీకి లభించాల్సిన గౌరవం, స్వేచ్చ నేటి సమాజంలో లభించడంలేదు అన్నది జగమెరిగిన సత్యం. ” ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరచరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అని అన్నాడు శ్రీ శ్రీ.. కాని ప్రస్తుత సమాజాన్ని చూస్తుంటే “ఏ యుగాన్న చూసినా ఏమున్నది గర్వకారణం స్త్రీ చరిత్ర సమస్తం మగపీడన పరాయణత్వం” చందంగా ఉన్నది స్త్రీ జీవితం.

హింసను సైతం తట్టుకునే ఓర్పు తన సొంతం:

కేవలం చదువులోనే కాదు సమాజంలో అనేకానేక విషయాలలో స్త్రీ వివక్షకు గురవుతూ నే ఉంది. అనేక రకాల హింసలను సహిస్తుంది. అదనపు కట్నం కోసమో.. అందంగా లేదనో.. పిల్లలు పుట్టలేదనో.. పుట్టినా ఆడపిల్ల పుట్టిందనో.. ఇలా రక రకాల కారణాలతో కిరోసిన్ పోసి తగలపెట్టే వాళ్ళు కొంతమంది.. కొట్టీ చంపి ఉరి పోసి తానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే వాళ్ళు కొంతమంది.. ప్రేమించలేదని దాడులకు పాల్పడే మూర్ఖులు కొంతమంది.. కుటుంబ నిర్వాహణ కోసం ఉద్యోగం చేసే స్త్రీలను ఇంటా బయటా హింసించే వారు మరికొంత మంది.. ఇలా ఒక్కరని కాదు సమాజంలో ఎక్కడ చూసినా క్రూరమైన మగ మృగాళ్ళు స్త్రీని హింసితూ నే ఉన్నారు.. ఇన్ని రకాల్ల హింసలను తట్టుకోవడం బహుషా కేవలం స్త్రీ కి మాత్రమే సాద్యమేమో.

 

కావలసింది సంఘటిత స్త్రీ శక్తి :

అయితే.. తన మీద జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను స్త్రీ ఎదురిస్తున్న సంఘటనలను అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సంఘటనలు మహిళల్లో కొంతలో కొంత చైతన్యాన్ని కలిగించగలుగుతున్నాయి. తమ స్వేచ్చా హక్కుల కోసం తాము ఆలొచించుకోగల శక్తి సామర్థ్యాలను ఇవ్వగలుగుతున్నాయి. తాము ఆడవాళ్ళం అయినంత మాత్రాన ఎందుకు లొంగిపోవాలి అనే భావన ఇప్పుడిప్పుడే వారిలో కలుగుతుంది. స్త్రీ పురుష సమానాధికారం కోసం ప్రభుత్వం ఎన్ని రకాల చట్టలు చేసినా వాటికి ఆమోదం లభించడంలేదు. బహుషా వాటిని అమలులోకి తెచ్చే రాజకీయ ప్రతినిధులలో ఉన్న పురుషాధిక్యత దానికి కారణం అయ్యుండొచ్చు. దీనిని సరిదిద్దటానికి స్త్రీ ఒంటరి పోరాటం చేస్తే ఆమె శక్తి చాలక పోవచ్చు. అందుకే ఇక్కడ కావలసింది సంఘటిత స్త్రీ శక్తి. ఈ శక్తి సంఘటితంగా శ్రమించి ప్రణాళికా బద్దంగా కార్యనిర్వాహణ నెరపడం అవసరం. ఈ శక్తికి కుటుంబాల ఆసరా ఉండాలి. సానుభూతితో స్త్రీ సమస్యలని అర్థం చేసుకోగల పురుషుల సహాయ హస్తాల తోడు కూడా ఉండాలి.

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సంఘాలు ఏర్పడినా పురుషాధిక్యత కలిగిన ఈ సమాజంలో స్త్రీ కి సమాన హక్కు రావాలంటే స్త్రీ ఎవరో ఎదో చేస్తారనుకుంటూ ఉండే కంటే తనే ధైర్యాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం. స్త్రీ ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొవాలి. ఆత్మరక్షణోపాయాలను తెలుసుకోవాలి. ఆర్థికంగా తనకాళ్ళపైన తాను నిలబడగలిగే స్థాయికి ఎదగాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా నేను అబలను అనే భావాన్ని మనసులో కలుగనీయరాదు. పురుషుడు ఏ హోదాలో ఉన్నా నా కంటే ఎక్కువ కాదు అనే బలమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. అప్పుడె స్త్రీ శక్తి, స్త్రీలకు మాత్రమే కాకుండా సర్వమానవాలికి విజయకేతనంగా బాసిల్లుతుంది.

ఈ “శ్రీమంతుడు” బుద్దిమంతుడు….

ఈ “శ్రీమంతుడు” బుద్దిమంతుడు….
వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకున్న నటుడు మహేష్ బాబు… తొలి ప్రయత్నంలోనే “మిర్చి” లాంటి బ్లాక్ బస్టర్ తో తనదైన ముద్ర వేసుకున్న దర్శక రచయిత కొరటాల శివ… వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా.. అది కూడా గ్రామీణ నేపథ్యంలో.. పేరేమో శ్రీమంతుడు.. కాని సైకిల్ నడిపే హీరో.. ఇలా విడుదలకు ముందే చాలా ఆసక్తిని రేకెత్తించిన సినిమా…
ముందుగా మిర్చిలాంటి పక్కా మాస్ సినిమా తర్వాత ఒక సందేశాత్మక చిత్రాన్ని , పైగా మహేష్ బాబు ని కథానాయకుడిగా ఉంచి సినిమా చేయాలనుకున్న కొరటాల శివ సాహసాన్ని అభినందించాల్సిందే. కమర్షియల్ హంగులన్నీ ఉంచుతూనే సొంత ఊరికి ఏదైనా చేయాలనే ఒక సందేశాన్ని అందించడం అంత తేలికైనా విషయమేమి కాదు. ఈ విషయంలో శివ విజయం సాధించారనే చెప్పాలి. కథ, కథనంలో వైవిధ్యం చూపుతూనే తన చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ప్రేక్షకులకు సూటిగా చెప్పేశారు. పంచ్ డైలాగ్ ల జోలికి పోకుండా, కథానుసారం సన్నివేశానికి తగిన భావోద్వేగాన్ని కలిగించేలా సింపుల్ డైలాగుతోను ఆకట్టుకున్నారు. సినిమా నిడివి ఎక్కువ కావడంతో కాస్త సాగదీస్తున్నట్టు అనిపించిన ప్రేక్షకులు బోర్ గా ఫీలవ్వలేదు అంటే దానికి కారణం మహేష్ బాబునే. నటుడిగా తను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమి లేకపోయినా ఒన్.. నేనొక్కడినే, శ్రీమంతుడు వంటి విభిన్న కథలను ఎంచుకుంటున్న తీరు చూస్తుంటే ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా ఇవ్వాలన్న తన తపన అర్థం చేసుకోవచ్చు. సినిమా మొత్తం తన నటనతో ఒన్ మాన్ షో గా మార్చేసాడు ఈ సినిమాలో.. సహజంగానే మహేష్ అంటే అందం.. కాని అంతకంటే అందంగా మహేష్ ను ప్రజెంట్ చేసిన ఘనత మాత్రం సినిమాటోగ్రాఫర్ మది దే.. శృతిహాసన్ తన పాత్ర పరిధిలో బాగానే నటించగా మహేష్ తండ్రిగా జగపతిబాబు భళా అనిపించుకున్నారు. మిగతా నటులలో రాజేంద్రప్రసాద్, ముఖేష్ ఋషి, సంపత్ తమ తమ పాత్రలలో ఇమిడిపోయారు. అన్ని బాగానే ఉన్న దేవిశ్రీ సంగీతమే కాస్త నిరాశపరిచింది. రామ రామ, చారుశీల పాటలు మాత్రమే కాస్త పర్వాలేదనిపించాయి. సినిమా నిడివి, కామెడీ లోకపోవడం, అంతగా ఆకట్టుకోలేని పాటలు, తేలిపోయిన క్లైమాక్స్ తప్పిస్తే మొత్తంగా శ్రీమంతుడు.. మంచి సినిమానే.. మంచి సినిమా అంటే మీరనుకునే మంచు కాదు.. అదో రకం…
కొసమెరుపు: సినిమా మొత్తంలో మహేష్ బాబు జగపతి బాబుని నాన్న అని ఒక్కసారి కూడా పిలవడు. బహుషా జగపతి బాబు ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని అలా జాగ్రత్త పడ్డారేమో మరి.
(మరో విషయం.. మహేష్ బాబు పుణ్యమా అని ఈ సినిమా తర్వాత సైకిల్ లకు, లుంగీలకు డిమాండ్ పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు..)

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ..అని కీర్తించిన ఈ సృష్టిలోని అలౌకికమైన తీయదనాల్లో స్నేహం ముఖ్యమైనది. ఈ సృష్టిలోని సమస్త జీవకోటి కోసం ఆ భగవంతుడు సృష్టించిన అద్భుతం ఈ స్నేహం. నిజమైన మిత్రులకు ఈ స్నేహం ను మించిన ఆస్తిలేదు. మరో మాటలో చెప్పాలంటే స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. జీవన వికాసానికి బాటలు వేస్తుంది. ఇద్దరు మనుషుల నడుమ పంటపొలాల మధ్య పాటలా పరవశించే ఈ స్నేహంలో ఎగుడుదిగుడు రహాదారుల్లో కూడా అలుపులేకుండా ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది. మధురమైన క్షణాలు, అలకలతో మూతి ముడుచుకున్న వైనాలు, బుజ్జగింపులు, రాయబారాలు, వెనువెంటనే చిరునవ్వుల సందళ్ళు.. ఇవన్ని తొంగి చూసేది స్నేహబంధంలోనే. ఈ మధురానుభూతుల బంధంలో ఒక మనసు బాధపడితే చెమ్మగిల్లే కన్నులు, ఒక పాదం తడబడితే ఉతమిచ్చే చేతులు ఎన్నో!

చిరునవ్వు విలువెంతో, దానిని అందుకొన్న అతిధికే తెలుసు. సూటి మాటలకున్న పదునెంతో వాటి ద్వారా గాయపడిన మనసుకే తెలుసు. జారిన కన్నీటి బరువెంతో అది జారడం ద్వారా తేలికపడిన గుండెకే తెలుసు. అలాగే స్నేహం గొప్పతనం ఏమిటో దానిని అనుభవిస్తున్న వారికే తెలుసు. కిరణానికి ఎలాగైతే చీకటి ఉండదో.. చిరునవ్వుకు ఎలాగైతే మరణం ఉండదో ఈ స్నేహమనే మధురభావనకి అంతం అనేది ఉండదు. జీవితమే ఉద్యాన వనంలో పుష్పించిన అందమైన పుష్పంగా కూడా మైత్రిబంధాన్ని అభివర్ణించవచ్చు. అది ఒక్కసారి హృదయపు తలుపును తడితే అందులోని మాదుర్యమంత ప్రతి మదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడుంటుంది. ఇద్దరు వ్యక్తులకు, ఇద్దరు మనసులకు (అంతకు ఎక్కువైనా కావచ్చు) సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తీపిని పెంచుతుంది. కాలాలకతీతంగా మైత్రి మధురిమ పెరుగుతోంది. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులతో చెప్పుకోవడం స్నేహం బంధంలోని గొప్పతనం. కష్టసుఖాల్లో అండగా ఉండే వారు.. నిస్వార్ధంగా సాయం అందించే వారు నిజమైన మిత్రులు. ఒక మంచి మిత్రుడు మనకు తోడుగా ఉంటె ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.

స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఆటపాటలాడుకునే చిన్నారుల దగ్గరినుంచి పండు వృద్దాప్యంలో ఉన్న అందరిలోనూ స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తున్న మనమందరం చాల అదృష్టవంతులం. ఎందుకంటే సృష్టిలో నా అన్నవారు, బంధువులు లేని వారెవరైనా ఉంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో ఉన్న ఆత్మీయులతో చెప్పుకోలేని ఎన్నో సమస్యలను స్నేహితుల వద్ద చెప్పుకుని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం గొప్పతనం.

స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు హాయిని ఇస్తుంది. “జీవనయానంలో స్నేహం శ్వాస వంటింది”, “స్నేహం అమ్మ ప్రేమకన్నా తియ్యనైనది”, “స్నేహితులతో కలిసి ఉంటే ఆనందం వర్ణించలేనిది”.. ఇలా ఎన్ని రకాలుగా వర్ణించినా స్నేహం గొప్పతనం ముందు దిగదుడుపే. అందుకే ఈ పవిత్ర బంధానికి చిహ్నంగా ఈరోజుని (ప్రతి ఆగస్టు నెల మొదటి ఆదివారాన్ని) ఫ్రెండ్ షిప్ డే గా జరుపుకుంటున్నాము.

కొసమెరుపు: “వివరిస్తున్నది అద్దం.. మన అనుబంధానికి అర్థం.. నువ్వు నాలాగే, నేను నీలాగా కనిపించడమే సత్యం” అంటూ ఒక సినీగేయ రచయిత స్నేహం గొప్పతనాన్ని వర్ణించాడు. అలా ఉండటమే నిజమైన స్నేహం. కాని నేటి సమాజంలో అటువంటి స్నేహం కనిపించుట చాలా అరుదైపోయింది (కనుమరుగైతే కాలేదు). ముఖ్యంగా ఒక ఆడ, ఒక మగ మధ్య స్నేహం ఒక ముసుగులా మారిపోయింది.(అందరూ అని కాదు). ఈ స్నేహమనే ముసుగులో, ప్రేమ అనే ఆకర్షణలోకి మారిపోయిన సంఘటనలు కోకొల్లలు. ఒక వేల ఆ ప్రేమ, పెళ్లి వరకు దారితీస్తే పరవాలేదు. కాని పటాపంచాలైతేనే స్నేహబంధంనే తప్పుగా అభివర్ణిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడితేనే స్నేహం మాధుర్యంగా ఉంటుంది.

– శ్రీకాంత్ కానం

అలకా.. ఓ చిలకా..!!

అలకా.. ఓ చిలకా..!!
కొంచెం ఉప్పు………కొంచెం కారం……..కొంచెం పిలుపు…….కొంచెం తీపి……..అన్ని కలగలిస్తేనే తినే ఆహరం రుచిగా ఉంటుంది. అలాగే కోపం,అలక,కాసేపు మౌనం,వాగ్వాదాలు …..అన్నీ కలగలిస్తేనే దాంపత్య జీవితం అందంగా ఉంటుంది.సంసారం రుచిగా ఉంటుంది.కానీ కూరలో ఉప్పు ఎక్కువైతే మొగుడి కోపం కారంగానే ఉంటుంది. రసంలో పులుపు ఎక్కువైతే అత్తమ్మ మాటలు తీపెక్కుతాయి.దీనికి తోడూ మొన్నటి ఇబ్బందులు……..నిన్నటి కోపాలు…..నేటి ఆఫీసు ప్రాబ్లెమ్స్ పోపులో తాలింపు గింజల్లా చిటపట లాడితే ఇంట్లో యుద్దానికి కుక్కర్ విజిల్ కొడుతుంది.ఆడవారిని ఇంట్లో మరీ కరివేపాకుల వాదేస్తున్నారని ప్రతీ ఇల్లాలు ఏదో ఒక సమయంలో అనుకుంటుంది.చిర్రుబుర్రులు,చిరాకులే కాకుండా చేయని తప్పుకు కూడా చీటికిమాటికి మాట అనేస్తుంటే ఇల్లాలు మాట్లాడటం మానేస్తుంది.సత్యభామ విషయంలో దీన్ని అలక అంటారు. శ్రీకృష్ణుడి భాషలో అవకాశం అంటారు.
“ఎప్పుడు లేత రంగు చీరలేనా..ఈ సారి ఈ ఆకుపచ్చ రంగు చీర కట్టుకో….అచ్చం అప్సరసలా ఉంటావు” అన్న భర్త వంక తదేకంగా చూసి…..”లేదు,నాకు ఈ ఆకుపచ్చ రంగు చీరనే నచ్చింది.నేను ఈ దీన్నే కట్టుకుంటాను” అని అన్న భార్య మీద భర్త అలిగే సందర్భాలు ఎన్నో.
భర్త చేత ఎలాగయినా సిగరెట్ మాన్పించాలని భార్య పట్టుబట్టి ఈ సారైనా విజయం సాధించాలన్న తపనతో భర్త చేతిలోన సిగరెట్ లాక్కొని విసిరి పారేసింది.”నా సిగరెట్ నా ఇష్టం.నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు” అన్న భర్త మాటకు మూగగా రోదిస్తూనే భార్యలు ఎందఱో.
భార్యాభర్తల మద్య అలక అక్కడితో ఆగిపోతే ఆ తర్వాత ఒక్క పలకరింపుతో పులకరింత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.”ఈ సారి మీరు చెప్పినట్లే చేస్తాను.ప్లీజ్ ఇక అలక మానండని ” తన చుబుకం పట్టుకొని బతిమాలుతుందని భర్త, భర్త వెనుక నుంచి వచ్చి ప్రేమగా తన మీద చేతులు వేసి “ఈ అలకలో నీ బుంగ మూతిని ఫోటో తీసి ఫ్రేమ్ కట్టిస్తాను.ఇలా ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా” అని అలిగిన తనను….. లాలిస్తాడని భార్య ఆశ పడటంలో అర్థం ఉంది.ఒక చిన్న అలక,అనంతర కలయిక….. స్తబ్దుగా ఉన్న జీవితంలో ప్రేమ సాగరాన్ని పొంగిస్తుంది.కొత్త అనుభూతిని మిగులుస్తుంది.
అలకలేని దాంపత్యం ఉంటుందా????
అసలు అలకంటే తెలియని వ్యక్తి ఉంటారా? అలక కేవలం ఆడవారి ఆయుధమేనా? మగవారిలో అలక ఉండదా? అంటే ఉంటుంది ,అయితే తేడా వెలిబుచ్చే రీతుల్లోనే ఉంటుంది. కోపం తెచ్చుకోవటం,రంకెలేయడం, నాలుగు మాటలు అని ఊరుకోవడం మగవాళ్ళు చేసే పనయితే……నా మనుసుని నొప్పించిన విషయమిది అని నోరు తెరిచి చెప్పుకోలేక మౌనంగా ఉంటే దానికి అలకని పేరుపెట్టి ఆడవారి ఆయుధంగా మార్చేసారు.
చిన్నపుడు నాన్న చాక్లెట్ తిననివ్వలేదని అలిగే పిల్లలు,పిల్లలు తమను పట్టించుకోవట్లేదని తల్లితండ్రులు చూపే అలకలన్నీ ప్రేమను చాటుకొనే చిరుజల్లులే అయితే మరి భార్యాభర్తల మధ్య అలకలు ఆత్మీయానురాగాలను మరింత పెంచేవి అవుతాయి కదా .
అలకలో ఆనందం
వాన వెలిశాక ఎంత హాయిగా ఉంటుందో… భాగస్వామి అలక మానాక అంతే హాయిగా ఉంటుంది.భాగస్వామి అలిగినప్పుడే అనుకోని అతిథులు వచ్చారంటే ఇక వారిముందు పడే బాధలు చెప్పలేనివి. అరువు తెచుకున్న చిరునవ్వుని పంచే భార్య మీద భర్త కృతజ్ఞత చూపిస్తే ఆ చిరునవ్వు సొంతమైపోదూ. నా కోసం కాదు, పరువు కోసమే కదా ఆమె అలా నటించింది అనేది అతని మాటయితే అది అగ్నికి ఆజ్యాన్నే చేరుస్తుంది. అతిథిలొచ్చినప్పుదు అలిగిఉన్న దంపతులు వారి ముందు సఖ్యతగా ఉన్నట్లు నటించినప్పటికీ అందులో దాగి ఉన్నది పరస్పర ప్రేమే కదా.
అలక ఎక్కువైతే
అయితే అదే అలక శ్రుతిమించినా…తరచు ఇలానే జరుగుతూ ఉన్నా,,,మనసులు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయిందంటే, భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. అలకని ఆయుధంగా ఎంచుకున్న వారికి దాన్ని ఎప్పుడు ఎలాంటి విషయంలో ఉపసంహరించుకోవాలో తెలిసుండాలి. అలా కాకుండా దాన్ని ఇగో ప్రాబ్లెమ్స్ గా మార్చుకుంటే ఆ చిక్కును విడదీయడం ఎవరితరమూ కాదు. ఎదుటి వ్యక్తీ మానసిక ప్రవర్తనను గమనించి అలకను ప్రదర్శించాలి. అలక మీద ఉన్నవారు పూర్తి స్థాయిలో ముడుచుకుపోయి మౌనంగా ఉండటం అలక కాదు. ఎదుటి వారితో సంభాషిస్తూనే తాము ఏ విషయంలో హర్ట్ అయ్యారో తెలియచేయాలి. అలా అంటే అలక ఆటవిడుపు అయ్యి ఇద్దరు వ్యక్తుల ఆనందాన్ని పెంచుతుంది.
భాగస్వామి అలిగిందన్న విషయం గుర్తించకుండా ఎవరి ధోరణి వారిదే అయితే తనకేం కావాలనే విషయాన్ని కనీసం గుర్తించలేని స్థితిలో ఉన్నారని కోపం ఎక్కువైతే అనర్ధాలకు అది దారి తీస్తుంది.
సాధించే భాగస్వామి ఉంటే ప్రతీ విషయానికీ ఇలాగే జరుగుతుంది. మాట మాట అనుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోయే అవకాశమూ ఉంది. కొందరు తాము అలిగితే ఆ విషయం ఎదుటివారికి తెలియాలని తమకి నష్టం చేసుకుంటారు. ఉదాహరణకి తిండి తినకుండా మానేయటం,శరీరాన్ని గాయపర్చుకోవడం వంటివి ఎన్నో…ఇలాంటివికూడదు
మనసెరిగితే మధురమే
ముక్కుతిమ్మన “పారిజాతాపహరణం” కావ్యంలో శ్రీ కృష్ణుడు సత్యభామ అలక వ్రతాన్ని మాన్పించే ప్రయత్నాన్ని ఒక వృత్తాంతంగా వివరించాడు. అంతటి మహామహులే అలక తరువాత ఆనందాలకు దాసోహమన్నారు.కాని మానవ మాత్రుల్లో మాత్రం అలక చినికి చినికి గాలి వానవుతుంది.
ఇప్పుడున్న బిజీలైఫ్ కి అలకలు, ఊరడింపులు కరువయి పోతున్నాయి.భార్య అలిగిందని భర్త సముదాయించే సమయం గాని, భర్త అలిగాడని భార్య గమనించే పరిస్థితి గాని ఉండడం లేదు. ఎవరి అవసరాలు వారివి ,ఎవరి ఆదుర్దా వారిదే. పర్యావసానం…….ఊహకందనిదే అవుతుంది ,ఇక్కడ కావలసింది కేవలం లాలన, పలకరింపు,ఒక చిన్న బహుమతి, ఒకరంటే ఒకరికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుపుకునే ఒక ఉత్తరం, ఒక ఎసెమ్మెస్ ,ఒక ఇ-మెయిల్ ఇలా మీ కమ్యూనికేషన్ ని పెంచే అంశం ఏదైనా కావచ్చు. లోలోపల ఒకరి మీద ఒకరికి దాగి ఉన్న ప్రేమను బలపరిచే కారణం అలకే అవుతుందంటే ఆ ఆనందాన్ని అందరూ సొంతం చేసుకోవాల్సిందే…………

నువ్వు – నేను

నా మనసును ఆహ్లదపరిచి నన్ను జోకొట్టే జాబిలమ్మవు నువ్వైతే..
నీ తనువును స్పర్శించే తొలిరవికిరణం నేనేగా..
నన్ను అల్లుకునే వలపు తీగ నువ్వైతే..
ఆ తీగను పెనవేసుకున్న ఆశల పందిరి నేనేగా..
ప్రేమ అనే ఉద్యాన వనంలో వికసించిన కుసుమం నువ్వైతే..
ఆ కుసుమపు మకరందాన్ని దాచుకునే తుమ్మెదను నేనేగా..
నా మదిలో మెదిలే ప్రతి ఆలోచనకు కారణం నువ్వైతే..
ఆ ఆలోచనలకు అక్షర రూపమిచ్చి ప్రాణం పోసే కవితను నేనేగా..
నాతో ఏడడుగులు నడిచే తోడువు నువ్వైతే..
నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే నీ నీడను నేనేగా…!!!

మనసుకు హత్తుకునే “భజరంగీ భాయ్ జాన్”

మనసుకు హత్తుకునే “భజరంగీ భాయ్ జాన్”
………………………………………………..
ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాల మీదనే నా అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. కాని నిన్న భజరంగీ భాయ్ జాన్ చూసాక మొదటి సారి హిందీ సినిమాపై రివ్యూ వ్రాయాలనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను.

భారత్, పాకిస్థాన్ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను రంజింపచేసాయి. కాని వాటిలో ఎక్కువగా సరిహద్దు పోరాటం గురించి, రెండు దేశాల మధ్య ఉన్న వైరం గురించి తెరకెక్కించినవే. వాటన్నింటికి భిన్నంగా సరికొత్త కథను అందించారు బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కథారచయితా విజయేంద్ర ప్రసాద్ గారు. వారందించిన కథను అంతే హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు కబీర్ ఖాన్.

పాకిస్థాన్ కు చెందిన ఆరేళ్ళ షాహిదా (హర్షాలి మల్హోత్రా) పుట్టు మూగ. హిందుస్థాన్ లో ఉన్న దర్గాకు వెళ్ళి వస్తే ఆ చిన్నారి మాటలు వస్తాయని ఒక పెద్దాయన చెప్పడంతో షాహిదాను తీసుకుని ఇండియా వస్తుంది వాళ్లమ్మ. తిరిగి పాకిస్థాన్ వెళ్ళే సమయంలో దురదృష్టవశాత్తు షాహిదా ట్రైన్ ను మిస్సవుతుంది. అప్పుడే ఆంజనేయుడికి పరమ భక్తుడైనా పవన్ కుమార్ చతుర్వేది అలియాస్ (సల్మాన్ ఖాన్) కంట పడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలను అతను ఎలా కనుక్కున్నాడు. ఆ చిన్నారి పాకిస్థాన్ కు చెందినది అని తెలుసుకుని, తన తల్లిదండ్రుల చెంతకు చేర్చడానికి పాకిస్థాన్ కు ఎలా వెళ్ళాడు.. అక్కడ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ. సల్మాన్ ఖాన్ సినిమా అనగానే ఒక ప్రేమ కథ, ఆరు పాటలు(అందులో ఒకటి ఐటెం సాంగ్), నాలుగు ఫైట్లు .. ఇవి సాధారణంగా అభిమానులు కోరుకునేది. కాని ఇటువంటి రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకుండా భావోద్వేగాలతో ముడిపడిన సినిమాను తెరకెక్కించి ప్రేక్షకాధరణ పొందడం అంత తేలికైన విషయం కాదు. కాని కబీర్ ఖాన్ ఈ విషయంలో విజయం సాధించాడు. పవన్ కుమార్ గా సల్మాన్ నటన, కొన్ని సన్నివేశాలలో అతను పలికించిన హావభావాలు అద్భుతమనే చెప్పాలి. సల్మాన్ ప్రేయసిగా కరీనా కపూర్ తన పరిధి మేరకు బాగానే నటించింది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలలోని గాఢత ప్రేక్షకుడికి తెలిసేలా చక్కగా ఉంది. అయితే ఈ సినిమాకు ఊపిరి పోసింది మాత్రం షాహిది(మున్నా) గా నటించిన హర్షాలి మల్హోత్రానే. ప్రతి సన్నివేశంలో ఆ అమ్మాయి తన హావభావాలతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. కొన్ని ఎమోషనల్ సీన్ లలో కంటతడి కూడా పెట్టించేలా తన క్యాకెక్టర్లో జీవించింది. ఆ చిన్నారి కోసమైన ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడొచ్చు.
ఫైనల్ గా రొటీన్ కథలకు భిన్నంగా కొత్త కథలు కోరుకునే వారు, కుటుంబ కథలను ఇష్టపడేవారందరూ తప్పక చూడాల్సిన సినిమా అని మాత్రం చెప్పగలను.

బాహుబలి – విజువల్ వండర్

బాహుబలి – విజువల్ వండర్

బాహుబలి – గత మూడేళ్ళుగా తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు, యావత్ భారత దేశ సినీ అభిమానులను ఎంతగానో ఊరించిన సినిమా. India’s Biggest Motion Picture, 5000+ computer graphic shots , 250+ crores budjet movie .. ఇలా ఎన్నో ఉపమానాలను మూటకట్టుకుని నిన్న వెండితెర మీదకు వచ్చిన బాహుబలి చిత్రం నిజంగా దర్శకుడు రాజమౌళి ప్రతిభకు అద్దం పట్టింది. హాలీవుడ్ ను తలదన్నేలా అబ్బురపరిచే గ్రాఫిక్స్ (చాలా చోట్ల గ్రాఫిక్స్ అన్ని సహజంగానే ఉన్నాయి) భారతీయ సినీ పరిశ్రమను మరో మెట్టు పైకి ఎక్కించాయి అని అనడంలో సందేహం లేదు. కండల వీరుడు ప్రభాస్ బాహుబలిగా, రానా భల్లాల దేవగా, మిల్కీ బ్యూటీ తమన్నా అవంతికగా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్ప గా సత్యరాజ్, దేవసేనగా అనుష్క (ఈ మొదటి భాగంలో ఆన్ స్క్రీన్ మీద తను కనిపించింది చాల తక్కువ) .. ఇలా అందరు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. అయితే వీరిలో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తించుకునే నటన ఎవరిదీ అంటే మాత్రం రమ్యకృష్ణ, రానా, సత్యరాజ్ లదే అని చెప్పొచు. మరీ ముఖ్యంగా నరసింహ లో నీలాంబరి పాత్ర తర్వాత రమ్యకృష్ణ అంత పవర్ ఫుల్ గా ఇందులో నటించింది. ఇక రానా చాల సన్నివేశాలలో ప్రభాస్ ను dominate చేసి మరి నటించాడు. కీరవాణి నేపథ్య సంగీతం కూడా సినిమాకు అదనపు బలం. అయితే ఎంత సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కించినా, నటీనటులు ఎంత బాగా నటించినా సినిమా జయాపజయాలను ప్రభావితం చేసేది కథ, కథనం మాత్రమే. ఇక్కడే రాజమౌళి తడబడినట్టు అనిపించింది. సినిమా ను రెండు భాగాలుగా చూపించే క్రమంలో మొదటి భాగం కథనం పూర్తిగా మందకొడిగా సాగినట్టు అనిపించింది. దానికి తోడూ పాటలు కూడా సినిమా ను మరీ నెమ్మదిగా మార్చేశాయి. సినిమా ఆరంభంలో వచ్చే జలపాతాల సీన్, పచ్చ బొట్టేసిన పాట, ద్వితియార్థంలో వచ్చే 20 నిమిషాల యుద్ధం సీన్ ( దాదాపు లక్ష మంది తో ఈ సీన్ ను తీసిన రాజమౌళిని ఎంత పొగిడిన తక్కువే ).. మాత్రమే ఒక ప్రేక్షకుడిగా నా కళ్ళు పక్కకు కదలకుండా చేసినవి. మందకొడి కథనం, Conclusion లేని ముగింపు.. ఒక ఇండియన్ క్లాసిక్ మూవీ గా ఉండాల్సిన చిత్రాన్ని కేవలం విజువల్ వండర్ గా మార్చేశాయి.

ఏది ఏమైనా జక్కన చేసిన ఈ ప్రయత్నాన్ని మాత్రం ఒక సినీ ప్రేక్షకుడిగా అభినందించి తీరాల్సిందే..!!!

జన్మదిన శుభాకాంక్షలు..!!

మనసుని దగ్గర చేర్చే సాన్నిహిత్యం..
మాతృ భాషలో ఎనలేని ప్రావీణ్యం..
మాటల్లో ఉంటుంది మాధుర్యం..
రాతల్లో దేనికదే నిత్య నూతనం..
అణువణువునా కనిపించును సంప్రదాయం..
ఆత్మీయతతో ఉప్పొంగును మన హృదయం..
ఈరోజు వారి జన్మదిన సంబరం..
ఈ శుభసందర్భంగా ఇది వారికి నేనిస్తున్న అక్షర నీరాజనం ..!!

పెద్దలు, గురు సమానులు శ్రీ కొండూరు వాసుదేవరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!

నేనవ్వనా..!!

నీ కళ్ళ చూపు నేనవ్వనా..
నా ప్రేమలోకాన్ని నీకు చూపించనా..
నీ పెదవి పలికే మాట నేనవ్వనా..
ప్రణయ గీతాన్ని ఆలపించనా..
నీ నిదురలో స్వప్నాన్ని నేనవ్వనా..
నీ చెంత చేరి అల్లరి చేసెయ్యనా..
నీ ఎదపై నేవాలిపోనా..
నీ ఎద సవ్వడి నేనై నా ఉనికిని చాటుకోనా..
నీ కౌగిలిలో బంధీనవ్వనా..
నీతో ఏడడుగుల బంధానికి సిద్ధమవ్వనా..!!